బంగ్లాతో జర జాగ్రత్త గత రికార్డులు మన వైపే

ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి మొదలుకాబోతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా... గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా టైటిల్ వేట మొదలుపెట్టనుంది.

  • Written By:
  • Publish Date - February 19, 2025 / 06:50 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి మొదలుకాబోతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా… గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా టైటిల్ వేట మొదలుపెట్టనుంది. గ్రూప్ ఏ లో ఉన్న భారత్ మిగిలిన మూడు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో ఒక్కోసారి తలపడుతుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన రోహిత్ సేన టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు రెడీ అవుతోంది. తొలి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే.. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లలో ఒకటి గెలిచిన సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. గ్రూప్ దశలో ఆడేది మూడు మ్యాచ్ లే కావడంతో ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. పాకిస్థాన్, న్యూజిలాండ్ కూడా ఇదే గ్రూప్ లో ఉండడంతో భారత్ సెమీ కు వెళ్లాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. బంగ్లాదేశ్ పై ఈజీగానే గెలిచే ఛాన్స్ ఉన్నప్పటకీ ఏమాత్రం ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

2007వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు బంగ్లా షాక్‌ ఇచ్చిన విషయం మన ఫ్యాన్స్ అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతోనే టీమిండియా గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. 192 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో ఛేదించింది. భారత్-బంగ్లాదేశ్ జట్లు ఐసీసీ వేదికలపై పదకొండు సార్లు తలపడగా భారత్‌దే పైచేయిగా ఉంది. బంగ్లాదేశ్ కేవలం ఒక్కదాంట్లో గెలవగా, మిగతా పదింటిలో టీమిండియా విజయం సాధించింది. 2011, 2015, 2019, 2023 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఘన విజయాలు సాధించింది. 2009, 2014, 2016, 2022, 2024 టీ20 వరల్డ్‌కప్‌లోనూ టీమిండియానే గెలిచింది.

అయితే భారత్‌తో మ్యాచ్‌ అంటే బంగ్లాదేశ్‌ కూడా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే టీమిండియా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. గత రికార్డులు మాత్రం పూర్తిగా భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. వన్డే ఫార్మాట్ లో ఇరు జట్లు 41 సార్లు తలపడితే భారత్ 32 మ్యాచ్ లలో గెలిచింది. బంగ్లాదేశ్ 8 సార్లు గెలవగా… ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, బంగ్లాదేశ్ ఒకసారి తలపడ్డాయి. 2017 ఎడిషన్ సెమీస్ లో బంగ్లాదేశ్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 264 పరుగులు చేయగా… టీమిండియా 40 ఓవర్లలోనే దానిని ఛేదించింది. ఈ సారి తొలి మ్యాచ్ లో బంగ్లాపై గ్రాండ్ విక్టరీ అందుకోవడం ద్వారా టోర్నీని ఘనంగా ఆరంభించాలనుకుంటున్న టీమిండియాకు ఆ జట్టు ఎంతవరకూ పోటీనిస్తుందో చూడాలి.