మోడీ.. మీ సహాయం మరువలేను: పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్

ఇటీవల సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ను తిరిగి దేశానికి తీసుకొచ్చిన అనంతరం.. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

  • Written By:
  • Publish Date - April 14, 2025 / 10:05 AM IST

ఇటీవల సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ను తిరిగి దేశానికి తీసుకొచ్చిన అనంతరం.. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, జనసేన నేతలు, కార్యకర్తలు, కూటమి పార్టీల కార్యకర్తలకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలుపుతూ పలు పోస్ట్ లు చేసారు.

“సింగపూర్‌లో నా కుమారుడు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్ లో జరిగిన విషాదకర అగ్నిప్రమాద సంఘటన సమయంలో సత్వర, సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ప్రధాని కార్యాలయానికి, దేశానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేసారు. సింగపూర్‌లోని భారత హైకమిషన్ సమన్వయంతో సింగపూర్ అధికారులు అందించిన సహాయం క్లిష్ట సమయంలో ఎంతో ధైర్యాన్నిచ్చిందన్నారు పవన్.

తాను ఉత్తరాంధ్ర మన్యంలో పర్యటనలో ఉన్నప్పుడు, ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఎన్డియే ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో తనకు ఈ విషయం తెలిసిందని.. తన కొడుకుతో పాటుగా ఈ ఘటనలో గాయపడిన ఇతర విద్యార్ధుల కొరకు.. మీరు అందించిన సహకారం అపారమైన బలాన్ని, ఉపశమనాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యంగా గిరిజన జీవితాలలో వెలుగులు నింపేందుకు అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టామని అన్నారు.

ఆయా వర్గాల అవసరాలను తీర్చడానికి మీరు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఇది ఒకటన్న పవన్.. వారి జీవితాలను మార్చడానికి మీరు చేసే విస్తృత ప్రయత్నాలలో ఇది కీలకమైన భాగమన్నారు. PM JANMAN, PMGSY, MGNREGS ల సహకారంతో, ₹1,005 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1,069 కి.మీ. రోడ్లను నిర్మిస్తుందన్నారు. అలాగే వారి నివాసాలకు కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తుందని.. ఈ ప్రాజెక్ట్ రవాణా సౌకర్యాలను సైతం మెరుగు పరుస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే సకాలంలో వైద్య సేవలను అందిస్తుందని.. సమాజం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న డోలీ కష్టాలకు ముగింపు పలుకుతుందని పోస్ట్ చేసారు పవన్. ఈ సవాళ్ళతో ఉన్న సమయంలో.. తన కుటుంబానికి అండగా నిలవడాన్ని మరువలేను అంటూ రాసుకొచ్చారు.