ప్లేస్ లేదని పంత్ ఎమోషనల్, చివరి వన్డేలోనైనా ఆడిస్తారా ?

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లలో భారత్ అదరగొడుతోంది. టీ ట్వంటీ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలిచింది. అయితే జట్టు కూర్పుపైనే ఇక్కడ చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - February 11, 2025 / 05:55 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లలో భారత్ అదరగొడుతోంది. టీ ట్వంటీ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలిచింది. అయితే జట్టు కూర్పుపైనే ఇక్కడ చర్చ మొదలైంది. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి టీమిండియాలో చాలా మార్పులు మొదలయ్యాయి. ప్రయోగాలకే పెద్దపీట వేస్తూ గంభీర్ జట్టును సిద్ధం చేస్తున్నాడు. రోహిత్, కోహ్లి మినహాయిస్తే మిగతావాళ్లకు మ్యాచ్‌లో అవకాశం దక్కడం గగనంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన రిషబ్ పంత్ కు ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఇప్పటి వరకూ ఛాన్స్ ఇవ్వలేదు. తొలి రెండు వన్డేలకు వికెట్‌ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకుంది. పంత్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. దీంతో పంత్.. మ్యాచ్ జరగే సమయంలో డగౌట్ లో ఎమోషనల్ అవుతూ కనిపించాడు.

ఏదేమైనా వన్డేల్లో మంచి డీసెంట్ రికార్డు ఉన్న పంత్.. ఈ సిరీస్ కు ఎంపికకాకపోవడంపై అలా నిరాశగా కూర్చున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ విఫలమవ్వడంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ కేవలం రెండు పరుగులే చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. రెండో వన్డేలోనూ ఆరో స్థానంలో వచ్చి పది పరుగులు చేసి షాట్‌కి ప్రయత్నించి వికెట్ల వెనక దొరికిపోయాడు. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన రాహుల్ ను పక్కన పెట్టి మూడో వన్డేలో అయినా రిషబ్ పంత్‌కి ఛాన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.

మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి కూడా గురించి పంత్ గురించి స్పందిస్తూ జట్టు కూర్పుపై విమర్శలు గుప్పించాడు. పంత్ ను పక్కన పెట్టడమే కాకుండా రాహుల్ బ్యాటింగ్ స్థానం మారుస్తూ ఒత్తిడి పెంచుతున్నారని ఫైర్ అయ్యాడు. అందుకే రాహుల్ ఫెయిల్యూర్స్ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడంటూ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ కు వన్డే స్పెషలిస్ట్‌గా ప్రత్యేక పేరు ఉంది. వికెట్ల వెనక చురుగ్గా క్యాచులు పట్టుకోవడం, రనౌట్లు, స్టంపింగ్స్ చేయడం.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బ్యాటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు స్థానాలు మారుస్తూ అతడిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇది జట్టుకు మంచిది కాదని పలువురు మాజీ ఆటగాళ్ళ గంభీర్ కు సూచిస్తున్నారు.