కోహ్లీ ఎంట్రీతో అతనిపై వేటు.. రెండో వన్డేకు తుది జట్టు ఇదే

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. కటక్ వేదికగా ఆదివారం జరగబోయే రెండో వన్డేలోనూ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

  • Written By:
  • Publish Date - February 9, 2025 / 06:05 PM IST

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. కటక్ వేదికగా ఆదివారం జరగబోయే రెండో వన్డేలోనూ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. మోకాలి గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రానున్నాడు. దీంతో జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్ లలో ఒకరిపై వేటు పడడం ఖాయమని చెప్పొచ్చు. నాగ్ పూర్ లో వన్డే అరంగేట్రం చేసిన జైశ్వాల్ 15 రన్స్ కు ఔటయ్యాడు. కానీ శ్రేయాస్ అయ్యర్ మాత్రం మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీని ప్రకారం చూసుకుంటే జైశ్వాల్ ను తప్పిస్తారని భావిస్తున్నారు. అప్పుడు రోహిత్ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. కోహ్లీ వన్ డౌన్ లో రానుండగా… శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు.

మిగతా లైనప్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహులే కొనసాగనున్నాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్ కొనసాగుతారు. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో స్థానం గ్యారంటీ. హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్‌ను అప్‌ది ఆర్డర్ ఆడించనున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తీని ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెడుతారు. మహమ్మద్ షమీకి రెస్ట్ ఇస్తే అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. కానీ బౌలింగ్ విభాగాన్ని మార్చే అవకాశాలు పెద్దగా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రయోగాలు చేయాలని భావిస్తే మాత్రం రిషభ్ పంత్‌ను కూడా ఆడించవచ్చు. అప్పుడు ఒక బౌలర్ ను తప్పించాల్సి ఉంటుంది.

కాగా కటక్ పిచ్ పరిస్థితిని చూస్తే ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే తుది జట్టులో కోహ్లీ ఎంట్రీ తప్పిస్తే వేరే మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ కు కూడా ఈ సిరీస్ కీలకంగా మారింది. మెగాటోర్నీకి జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు ఆ జట్టు కూడా ట్రై చేస్తోంది. సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో కటక్ లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు.