పంజాబ్ ను దాటేసిన ఢిల్లీ, సూపర్ ఓవర్ లో సూపర్ రికార్డ్

ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 రన్స్ చేయడంతో టై అయింది.

  • Written By:
  • Publish Date - April 17, 2025 / 12:51 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 రన్స్ చేయడంతో టై అయింది. అయితే సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ 11 పరుగులు చేయగా.., ఢిల్లీ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి ఐపీఎల్ లో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతను నిర్ణయించడం అనేది నాలుగేళ్ల అనంతరం ఇదే తొలిసారి.

చివరగా ఐపీఎల్ 2021లో సూపర్ ఓవర్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచింది. ఇరు జట్లు 159 పరుగులే చేయడంతో టై అయ్యి, సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ దిగినప్పటికీ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశారు. ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లాస్ట్ బాల్‌కి కంప్లీట్ చేసి జట్టును గెలిపించారు.

తాజా సీజన్ లో ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను విజేతంగా నిలపడంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తో పాటు సూపర్ ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి సూపర్ విక్టరీని అందించాడు. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సూపర్ ఓవర్ లో అద్భుత విజయాన్ని సాధించడంతో పాటు కీలక రికార్డును కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 5సార్లు సూపర్ ఓవర్‌కు చేరుకుంది. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు సార్లు గెలిచింది. ఢిల్లీ ఇప్పుడు ఐపీఎల్ లో అత్యధిక సూపర్ ఓవర్లు గెలిచిన జట్టుగా అవతరించింది. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ జట్టును ఢిల్లీ అధిగమించింది. పంజాబ్ కింగ్స్ జట్టు మూడు సార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.