ఆరంభంలో ఓటములు, కట్ చేస్తే ఫైనల్లో కావ్యాపాప టీం

సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ కు గోల్డెన్ టైమ్ నడుస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆమె తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీలో ఆమె మేజర్ వాటా దక్కించుకుంది.

  • Written By:
  • Publish Date - February 7, 2025 / 06:10 PM IST

సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ కు గోల్డెన్ టైమ్ నడుస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆమె తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీలో ఆమె మేజర్ వాటా దక్కించుకుంది. ఇటు సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో ఆమె ఓనర్ గా ఉన్న సన్ రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ మరోసారి ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయర్ లో పార్ల్ రాయల్స్ పై గెలిచి వరుసగా మూడోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది. మొదట బ్యాటింగ్‌ కు దిగిన పార్ల్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మాన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 రన్స్ చేయగా… ఓపెనర్‌ ప్రిటోరియస్ హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో మార్కో జానెసన్‌, మార్‌క్రమ్‌, బార్టమన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్.. కేవలం రెండు వికెట్లే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఆ జట్టు ఆదిలోనే డేవిడ్ బెడింగ్‌హామ్ వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత టోనీ డి జోర్జీ, జోర్డాన్ హెర్మాన్ ద్వ‌యం రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఈ జోడి జాగ్ర‌త్త‌గా ఆడింది. రెండో వికెట్‌కు ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్‌ టోనీ డి జోర్జి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 78 పరుగులు చేశాడు. జోర్డాన్‌ హెర్మాన్‌ 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 69 అజేయ పరుగులు చేశాడు. రాయల్స్‌ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలో వికెట్‌ తీశారు.

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ప్రారంభం కాగా వరుసగా మూడు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఫైనల్స్‌లో నిలిచింది. 2023లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై, 2024లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి వరుసగా రెండుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది.శనివారం జరిగే ఫైనల్లో సన్ రైజర్స్ ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడనుంది. తొలి రెండు సీజన్లలోనూ సన్ రైజర్స్ ఛాంపియన్ గా నిలిచినప్పటకీ.. ఈ సారి మాత్రం ఆరంభంలో పేలవ ప్రదర్శన కనబరిచింది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి అసలు క్వాలిఫైయర్స్ కైనా చేరుతుందా అనుకున్నారు. కానీ అద్భుత ప్రదర్శనతో పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలతో ఇప్పుడు ఫైనల్లో అడుగుపెట్టింది.