రాహుల్ గాంధీతో వైఎస్ జగన్ భేటీ…?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ఢిల్లీలో మద్దతు కోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 19, 2025 / 03:50 PM IST

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ఢిల్లీలో మద్దతు కోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా వైసిపి ఆంధ్రప్రదేశ్ లో నిలబడాలి అంటే కచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు కావాల్సిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వైఎస్ జగన్ దగ్గర కాలేకపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కీలకంగా ఉండటం.. ఆయనకు జగన్ కు మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో జగన్ ను కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గర కానీయడం లేదు రేవంత్ రెడ్డి.

ఏపీలో కూటమి ప్రభుత్వం తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడంతో జగన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పోలీస్ అధికారులు ముందు కాస్త సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. క్రమంగా పరిస్థితులు జగన్ కు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక ఢిల్లీలో కూడా జగన్ కు అనుకూల వాతావరణం కనబడటం లేదు. విజయ సాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పకున్న తర్వాత ఢిల్లీలో జగన్ తరఫున నిలబడే నాయకుడు కరువయ్యారు.

దీనితో స్వయంగా తానే రంగంలోకి దిగాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం జగన్ దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి కూడా ఈ ప్రయత్నాలు చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. కేవీపీ రామచంద్రరావును అడ్డం పెట్టుకుని జగన్ కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే జగన్.. రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక షర్మిల కూడా తనను ఏపీలో ఇబ్బంది పెట్టడంతో… జగన్ కాస్త జాగ్రత్తగా రాజకీయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

షర్మిల పదేపదే తనను టార్గెట్ చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే వైసీపీ ఓటు బ్యాంకు ను చీల్చే ప్రయత్నాన్ని షర్మిల చేస్తున్నట్టు అర్థం అవుతుంది. అందుకే జగన్ ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2010లో జగన్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా విభేదించారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ కు దూరంగానే ఉన్నారు. ఇక అప్పట్లో సోనియాగాంధీ కూడా జగన్ విషయంలో సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది.

ఇలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలి అనుకోవడం మాత్రం రాజకీయంగా కాస్త ఆసక్తిని రేపుతోంది.. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసిపి నిలబడాలి అంటే ఆ పార్టీ నేతలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనితో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటే తనకు కాస్త ఫలితం ఉంటుందని… బిజెపితో ఎలాగో దగ్గర అయ్యే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ కు దగ్గర అయితే కొన్ని విధాలుగా ప్రయోజనాలు ఉంటాయని జగన్ భావిస్తున్నారు.