లిక్కర్ డాన్ గా మిథున్ రెడ్డి.. మద్యం దందాలో ఇతని మాటే శాసనం

వైసీపీ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో...రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చక్రం తిప్పారా ? మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు...ముడుపులు ఇచ్చే సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూశారా ?

  • Written By:
  • Publish Date - March 15, 2025 / 03:20 PM IST

వైసీపీ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో…రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చక్రం తిప్పారా ? మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు…ముడుపులు ఇచ్చే సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూశారా ? ఆ కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేశారా ? వచ్చిన ముడుపులను…తమ అధినేతకు చేర్చటంలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారా ?

మద్యం దందా మొత్తం మిథున్ కనుసన్నల్లోనే…వైసీపీ హయాంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణమంతా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, అడిగినంత కమీషన్‌ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇవ్వడంలో ఆయనే కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. మద్యం సరఫరా చేసిన తర్వాత వారి నుంచి వసూళ్లు చేయడం…ఆ కమీషన్ల సొమ్మును బిగ్‌బాస్‌కు చేర్చటంలో ప్రధాన పాత్ర అని ఎక్సైజ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐటీ సలహాదారుగా పని చేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని తెర ముందు పెట్టుకుని…మద్యం దందా నడిపించారన్న విమర్శలున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే…రాష్ట్రంలోనే అతి పెద్ద డిస్టిలరీగా పేరున్న మాజీ ఎంపీ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌పై కన్నేశారు. నంద్యాలలో ఉన్న అగ్రో ఇండస్ట్రీస్ ను ఎంపీ మిథున్‌రెడ్డి అనధికారికంగా తన గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రొడక్ట్స్‌ డిస్టిలరీలోనూ పాగా వేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్ల మద్యాన్ని తయారు చేయించారు.

ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ 6వేల కోట్ల ఆర్డర్లు ఏపీఎస్‌బీసీఎల్‌ 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు మధ్య కేవలం 25 నెలల వ్యవధిలో ఏకంగా 18 వందల 63 కోట్ల విలువైన కోటీ 16 లక్షల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను…ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ కంపెనీకి కట్టబెట్టింది వైసీపీ సర్కార్. జగన్​ సర్కార్​ ఐదేళ్ల పాలనలో…ఈ కంపెనీకి ఇచ్చిన మద్యం సరఫరా ఆర్డర్ల విలువ రూ. 6 వేల కోట్లపైనే ఉంటుందనేది అనధికారిక అంచనా. మద్యం తయారు చేసేది, దాన్ని ఏపీఎస్‌బీసీఎల్‌తో కొనుగోలు చేయించింది రెండూ మిథున్‌రెడ్డేనని ఫిర్యాదులున్నాయి. ఏపీఎస్‌బీసీఎల్‌ వద్ద మొత్తం 235 మద్యం సరఫరా కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో 168 ఆంధ్రప్రదేశ్​లో మద్యం ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో కేవలం ఏడు సంస్థలకే 9221 కోట్లు విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో అత్యధికం గత సర్కర్ పెద్దలకు అస్మదీయ కంపెనీలు లేదా ముడుపులు చెల్లించిన సంస్థలేనని దర్యాప్తులో తేలింది.

బినామీ పేరుతో విజయిసాయిరెడ్డి అల్లుడి మద్యం కంపెనీ గత ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిన 2 నెలలకే….మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ…2 డిసెంబరు 2019న హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఈ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను సబ్‌లీజు పేరిట అనధికారికంగా ఆధీనంలోకి తీసుకుంది. జే బ్రాండ్లు తయారు చేసి జనంపైకి వదిలింది. కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం 25 నెలల వ్యవధిలో రూ.1164 కోట్ల 86 లక్షల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. గత నాలుగున్నరేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు విలువైన సరఫరా ఆర్డర్లు లభించినట్లు అనధికారిక లెక్క అంచనా.