ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది. మనిషి చూడ్డానికి బాగానే ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు జబ్బు పడుతున్నారు. అసలు పవన్ కల్యాణ్ సమస్యేంటి ? నిజంగా పైకి చెబుతున్న ఆరోగ్య సమస్యలతోనే ఆయన బాధపడుతున్నారా.. లేక ఇంకేమైనా సమస్యలున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరోగ్యంపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ ఇలా అడుగడుగునా అనారోగ్యానికి గురి కావడం జన సైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో తరచుగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నది చర్చగా ఉంది. ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చారు.
ఉదయం పదకొండు గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా.. పవన్ ఉదయం పదిన్నరకే చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా మీటింగ్ లో పాల్గొనాలని వచ్చారు. అయితే ఆయన సచివాలయానికి చేరుకునే సరికే జ్వరం అధికం అయినట్లు సమాచారం. దీంతో ఆయన తన క్యాంప్ ఆఫీసుకు తిరిగి వెళ్లిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడం కోసం కూడా ఆయన వెయిట్ చేయలేక అక్కడే కుర్చీలో కొంతసేపు కూర్చుండిపోయినట్లు సన్నిహిత వర్గాల టాక్. దీంతో పవన్ కి ఏమైంది అన్న చర్చ అందరిలోనూ బలంగా వినిపిస్తోంది.
పవన్ కు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి అన్నది మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఇదే విషయంపై పవన్ అభిమానులు, జన సైనికులు మరింత ఆందోళన చెందుతున్నారు. పవన్ కల్యాణ్ చాలా కాలంగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్ కు ఈ సమస్య ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిపక్ష నేతగా ప్రజల్లో పర్యటించినప్పుడూ ఒక్కోసారి ఈ సమస్యతోనే అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఓ వైపు తీరిక లేకుండా ప్రజా సమస్యలు, మరోవైపు సినిమాలు కారణంగా పవన్ తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
అయితే పవన్ తన హెల్త్ విషయంపై శ్రద్ధ తీసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. పవన్ ఇపుడు చాలా కీలకమైన బాధ్యతలతో ఉన్నారు. ఓవైపు సినిమాలు.. అలాగే రాజకీయంగా ఆయన ఇపుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో ఉన్నారు. జనసేన పార్టీకి ఆయన సర్వస్వం. దీంతో ఆయన ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకు ఉన్నది స్పాండిలైటిస్ సమస్యే అయితే దానికి బెస్ట్ మెడిసిన్ విదేశాల్లో ఉందని.. కొన్నాళ్లపాటు అన్నింటికీ బ్రేక్ ఇచ్చి ఆరోగ్యం చూసుకోవాలని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.